ధరణిలో నాలా రిజిస్ట్రేషన్లు షూరూ

హైదరాబాద్‌,తీస్మార్ న్యూస్: ఈరోజు నుండి ధరణి పోర్టల్ ద్వారా నాలా దరఖాస్తులకు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసింది. ఇందులో భాగంగా నేటి నుంచి వ్యవసాయేతర భూములు (నాలా)గా కన్వర్షన్‌తోపాటు ధరణికి ముందు రిజిస్ట్రేషన్‌ అయిన వ్యవసాయభూముల మ్యుటేషన్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.నేటి నుంచి నాలా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌ మ్యుటేషన్లకు ధరణి పోర్టల్‌ ద్వారా 7058 వ్యవసాయ భూముల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 59,294 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. దీనికోసం 80,947 మంది స్లాట్లు బుక్‌చేసుకోగా.. రూ.87.02 కోట్ల ఆదాయం వచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్‌ఆర్వోల్లో నిన్న 140 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. తొలిరోజు సోమవారం 82 రిజిస్ట్రేషన్లు కాగా, బుధవారం రిజిస్ట్రేషన్ల కోసం 433 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఇప్పటివరకు స్లాట్‌బుకింగ్‌ల కోసం 2,427 మంది రూ.43.62 కోట్లు చెల్లించారు.