హైదరాబాద్: ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ సంబంధిత అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే పోర్టల్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్ తీరుతెన్నులు, క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకోవడాని సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి కొంత మంది మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈమేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్‌కు రావాలని టీఎన్జీవో, టీజీవో నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది. దాదాపు 200 మంది ఉద్యోగులు, అధికారులు సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.