కొత్త సంవత్సరం…సీఎం కేసీఆర్ కొత్త కానుక

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముందే నూతన సంవత్సర సంబురం వచ్చింది. వేతనాల పెంపు, పదవీ విరమణ వయసు, పదోన్నతులు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వ నిర్ణయాలను హర్షిస్తూ మంగళవారం రాత్రి గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు సంబురాల్లో మునిగితేలాయి. పటాకులు కాలుస్తూ ముందుగానే న్యూ ఇయర్‌ గిఫ్టు వచ్చిందంటూ కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. ఉద్యోగులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగ వర్గాల్లో నయాసాల్‌ ముందే వచ్చింది. కొత్త సంవత్సరానికి రెండ్రోజుల ముందే ప్రతి ఉద్యోగి ఇంట సంబురాలు మొదలయ్యాయి. వేతనాల పెంపు, పదవీ విరమణ వయసు పెంపుతో పాటు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల మోముల్లో చిరునవ్వు విరబూస్తున్నది. గ్రేటర్‌ పరిధిలో సచివాలయం ఉద్యోగులు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోని వారితో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ట్రై కమిషనరేట్ల పరిధిలోని దాదాపు 20 వేల మంది ఉద్యోగులతోపాటు ఆర్టీసీలోని 18,965 మంది లబ్ధి పొందనున్నారు. మరోవైపు కొత్త సంవత్సరంలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడం నిరుద్యోగుల్లోనూ నూతన సంవత్సర సంతోషాల్ని ముందుగానే తెచ్చినట్లయింది. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక… కొంతకాలంగా ఎల్‌ఆర్‌ఎస్‌ లింకుతో స్తబ్దుగా ఉన్న రియల్‌ వ్యాపారం పుంజుకోనుంది. ఉద్యోగులు…నిరుద్యోగులు… రియల్‌ వ్యాపారులు… ప్లాట్ల యజమానులు… ఇలా అందరికీ ఒకే రోజు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించడంతో గ్రేటర్‌ సంబురాల మయం అయ్యింది.

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
నూతన సంవత్సరం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించడం హర్షణీయం. ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. ఆర్టీసీ భారమంతా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించడం మరిచిపోలేనిది. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. – హేమంత్‌కుమార్‌, ఆర్టీసీ ఉద్యోగి

ప్రభుత్వ నిర్ణయం భేష్‌…
సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు తీపికబురు అందించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు, జీతాలను పెంచుతూ మంచి నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఉద్యోగులు ఉత్సాహంగా పని చేయడం ఖాయం. – సీహెచ్‌ సాంబయ్య, ప్రధానోపాధ్యాయుడు రియల్‌ రంగానికి ఊపు

రియల్‌ రంగానికి ఊపు
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్‌ రంగానికి ఊపు రావడం ఖాయం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేయడం సంతోషంగా ఉంది. అనుమతి లేని, క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఓకే చెప్పడం ఉత్సాహంగా ఉంది. కరోనా దెబ్బకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. -అనిల్‌కుమార్‌, రియల్‌ వ్యాపారి

సాహసోపేత నిర్ణయం
ఎల్‌ఆర్‌ఎస్‌, ఉద్యోగుల వేతనాల పెంపుపై సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ, పదవీ విరమణ వయోపరిమితి పెంపు, పెన్షనర్లకు వర్తింపు, బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలనడం శుభసూచకం. పీఆర్‌సీ కోసం వేచి చూస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషం. బాధ్యత గల ఉద్యోగులుగా మరింత కష్టపడి పనిచేసి, మెరుగైన సేవలందిస్తాం.- ముజీబ్‌ హుస్సేనీ, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు

‘వయసు పెంపు’ శుభ పరిణామం
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడం శుభ పరిణామం. ఉదోగ్య సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌ తాను ఇచ్చిన హామీని నెరవేర్చి ఎంతో మంది అనుభవం కల్గిన ఉద్యోగుల సేవలను మరికొంత కాలం ఉపయోగించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ రీత్యా ఎంతో అనుభవం కల్గిన ఉద్యోగులకు పదవీ కాలం పెరగడం వల్ల మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. – చిలుకా నర్సింహారెడ్డి, తెలంగాణ మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల సెంట్రల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు

ప్రజలకు మేలు చేయడమే సీఎం లక్ష్యం
రాష్ర్టాభివృద్ధితోపాటు ప్రజలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతుబంధు ఇవ్వడంతో పాటుగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడంతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచడం, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతం ఇస్తూ ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.- ఉపేంద్ర, తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ అధికార ప్రతినిధి

సీఎం నిర్ణయం హర్షణీయం
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో పని చేస్తున్న వారికి చాలా ఆనందంగా ఉంటుంది. మరింత ఎక్కువ మంది పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిద్దే అవకాశం దక్కుతుంది. కేవలం ఉపాధ్యాయులే కాకుండా అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణతో పాటు జీతాలు పెంచడం సంతోషంగా ఉంది. దీంతో పాటుగా ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేలా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేకూరుస్తుంది. – రమేశ్‌, సిద్ధిక్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

ఆర్టీసీని ఆదుకోవడం సంతోషం
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను సీఎం కేసీఆర్‌ మరింత ఆదుకొని ముందుకు నడిపించడం ఎంతో సంతోషకరం. సంస్థపై పడే భారాన్ని ప్రభుత్వం భరించడం లాంటి నిర్ణయం గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని గుర్తించిన సీఎంకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.- కృష్ణమూర్తి, కంటోన్మెంట్‌ డిపో మేనేజర్‌

మినహాయింపు గొప్ప నిర్ణయం
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం మినహాయింపు ఇవ్వటం ద్వారా ఎంతో మంది ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఈ విధానం ద్వారా ఇంటి రిజిస్ట్రేషన్‌లు చేసుకోవటంతో పూర్తి యాజమాన్య హక్కు లభిస్తుంది. దీనికి తోడు క్రయవిక్రయాలు చేసుకునేందుకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వమే సానుకూల నిర్ణయం తీసుకోవటాన్ని మా అసోసియేషన్‌ తరఫున స్వాగతిస్తున్నాం.- ముప్పా సుబ్బయ్య, వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

సీఎంకు ధన్యవాదాలు
ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి మా ధన్యవాదాలు. ఇంతకాలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు ఆగిపోడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఏం చేయాలో తెలియక అవస్థలు పడ్డాం. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేసిందని తెలియగానే ప్రాణం లేచి వచ్చింది. రేపటి నుంచి వ్యాపారం మొదలవుతుందన్న ఆశ చిగురించింది. – ప్రేమ్‌కుమార్‌, రియల్టర్‌ కుర్మల్‌గూడ

నిరీక్షణకు ఫలితం లభించింది
చాలా కాలంగా పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న మాకు 2021 నూతన సంవత్సర కానుకగా కొత్త పీఆర్‌సీ ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా హెచ్‌సీయూ ఆర్టీసీ కార్మికుల పక్షాన కృతజ్ఞతలు చెబుతున్నా.- శ్రీనివాస్‌గౌడ్‌, ప్రకాశ్‌నగర్‌,హెచ్‌సీయూ కండక్టర్‌

ఆర్టీసీ ఉద్యోగులం రుణపడి ఉంటాం
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను తెలంగాణ ప్రభుత్వం పెంచిన కేసీఆర్‌… మరోసారి పేదలు, కార్మికుల పక్షపాతిగా గుర్తింపు పొందారు. కరోనా కాలంలో కార్మికుల ఇబ్బందులను గుర్తించి కార్మికులను కాపాడారు. ఇప్పుడు జీతాలు పెంచి ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటుంన్నందుకు సీఎం కేసీఆర్‌కు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. పదవీ విరమణ వయసు పెంచి కార్మికుల కుటుంబాలను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.- జితేందర్‌, ఆర్టీసీ ఉద్యోగి మహేశ్వరం డిపో

కొత్త సంవత్సరం కానుకే
కొత్త సంవత్సరం కానుకగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాన్ని పెంచుతామనడం అభినందనీయం. ఉద్యోగుల వేతనాలతో పాటు పదవీ విరమణ వయస్సు పెంచేందుకు సీఎం తీసుకున్న నిర్ణయం గొప్పది. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సగం జీతం ఇచ్చి… ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి జీతాన్ని అందించి సీఎం కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు జీతాలు పెంచుతామని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులపై మమకారాన్ని చాటారు.- రమేశ్‌, ఆర్టీసీ కండక్టర్‌

ఎంతో ఆనందంగా ఉంది
సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. వేతన పెంపు నిర్ణయంతో ఉద్యోగులు ఆనందంగా ఉన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలు పరిష్కారం కావడం హర్షణీయం.- విజయలక్ష్మి, ఎంపీహెచ్‌ఓ, కందుకూరు

సంతోషంగా ఉంది
కొత్త సంవత్సరంలో మాకు జీతాలు పెరగడం చాలా సంతోషకరం. పోలీసుల సేవలను ప్రత్యేకంగా గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. కొత్త సంవత్సరం అన్ని విధాలుగా పోలీసులకు కలిసివస్తుందని ఆశిస్తున్నాం.- ఎన్‌.శంకర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు

మా సేవకు ప్రత్యేక గుర్తింపు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీతాలు పెంచడం మా సేవలను ప్రత్యేకంగా గుర్తించడమే. లాక్‌డౌన్‌, వరదల్లో మేం అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించింది. ప్రజల కోసం 24/7 పనిచేస్తున్న పోలీసులకు ఈ పెంపుదలతో ఆర్థిక స్వావలంబన లభిస్తుంది.- భద్రారెడ్డి, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు

కేసీఆర్‌ మాకు ఆపద్బాంధవుడు
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో హోంగార్డుల జీవితాలు బాగు పడుతున్నాయి. కిందిస్థాయిలో ఉండే వారిని ఆదుకోవడం, వారికి కడుపు నిండా బువ్వ పెట్టడంలో దేశంలోనే కేసీఆర్‌ ముందుంటారు. మాకు జీతాలు పెంచడంపై యావత్‌ రాష్ట్రంలోని హోంగార్డులందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. – కొత్వాల్‌ దయానంద్‌, తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల అధ్యక్షుడు

మా జీవితాల్లో కొత్త వెలుగు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాకు జీతాలు పెంచుతామని ప్రకటించడంతో మా కుటుంబాలలో కొత్త సంవత్సరం వేల వెలుగులు నింపుతుంది. ఈ జీతాల పెంపుతో మా కుటుంబాలు సంతోషంగా జీవిస్తాం. ఈ నిర్ణయం పట్ల ఎన్నో వేల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.- వేణు, హోంగార్డు

ఆర్టీసీని ఆదుకుంటున్నారు
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్‌ ఆదుకోవడం మంచి పరిణామం. తెలంగాణ ఏర్పడ్డాక కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదీ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని సంరక్షించుకుంటూ సంస్థ బతికిస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ఆయన మా పాలిట దేవుడు. స్ట్రైక్‌ పీరియడ్‌లో ఏ ప్రభుత్వాలు కూడా జీతాలు ఇవ్వదు. అలాంటిది కేసీఆర్‌ దయతలిచి జీతాలిచ్చిన్రు. కేసీఆర్‌ మేలు మరువలేము. – శ్రీనివాస్‌ రావు, అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆర్టీసీ బస్‌ భవన్‌

వేల కుటుంబాల్లోపండుగ నింపింది
ఆర్టీసీ ఉద్యోగుల కష్టం, ఆర్థిక సంక్షోభం, పనిభారం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతన సవరణ ప్రకటించడం గొప్ప విషయం. ఆర్టీసీ ప్రతి ఉద్యోగి ఇంట ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త కాంతులు నింపారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ సాధనలో అందరికంటే ఒకడుగు ముందే ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు ఆయనకు మున్ముందు కూడా మద్దతుగా ఉంటారు. – ఆర్‌.శ్రీనివాస్‌ గౌడ్‌, టీఎస్‌ ఆర్టీసీ, సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌

ఉద్యోగాల భర్తీ నిర్ణయం అభినందనీయం
రాష్ట్రంలో అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియను ప్రారంభించేందుకు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలలోని ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగ నియామకాలతో మరింత సర్వతోముఖాభివృద్ధి సాధించి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుంది. -కృష్ణయాదవ్‌, టీజీవో హైదరాబాద్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు

ఎంతో సంతోషంగా ఉంది
ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు కారుణ్య నియామకాలు, అన్ని శాఖలలో భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటిచండం గొప్ప విషయం. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల యావత్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పాటు పడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆరెస్సే. -సల్వది శ్రీరాం, టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు
సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో 2021 నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభాలు కలుగుతాయి. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులు పోషించిన పాత్రను ప్రభుత్వం గుర్తించింది. అన్ని శాఖల ఉద్యోగులపై వరాల జల్లు కురిపించడం అభినందనీయం.- రామినేని శ్రీనివసారావు, టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాధికారి

సీఎం మంచితనానికి నిదర్శనం
సుదీర్ఘమైన 55 రోజుల సమ్మె కాలానికి జీతం చెల్లించడం కేసీఆర్‌ మంచితనానికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికుల వేతనాలు కూడా పెంచుతామని ప్రకటించడం హర్షణీయం. సీఎం ప్రకటన ఆర్టీసీ కార్మిక లోకాన్ని ఆనందంలో ముంచెత్తింది. కార్మికులు, ఉద్యోగులకు నూతన సంవత్సర పండుగ వాతావరణాన్ని కల్పించారు. ఆర్టీసీ ఉద్యోగుల త్యాగాన్ని గుర్తించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – బి.పుల్లయ్య, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు