సిద్దిపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన విశాల హృదయాన్ని చాటారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడి వైద్యచికిత్సకు సీఎం మానవతా దృక్పథంతో స్పందించి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సీఎం సొంత నియోజకర్గవర్గం గజ్వేల్‌లో పశువుల లచ్చయ్య, సుగుణ దంపతుల కుమారుడు మహేశ్(27). కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాలేయ మార్పిడి చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇందుకు పెద్దమొత్తంలో డబ్బులు అవసరం కావడంతో నిరుపేద కుటుంబం దిక్కతోచని స్థితిలో పడింది. సమస్యను తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్ విషయాన్ని టీఎస్ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. వీరు సీఎం కేసీఆర్‌కు దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణం స్పందించిన సీఎం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల చెక్కును రాసిచ్చారు. ఈ చెక్కును మంత్రి హరీశ్‌రావు, వంటేరు ప్రతాప్‌రెడ్డి మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోడ్డిన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటుకు రాజు, దుంబాల కిషన్ రెడ్డి, నవాజ్ మీరా, మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి బాధిత కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.