సీఎం కేసీఆర్ దత్త పుత్రిక వివాహం

జూబ్లీహిల్స్‌,తీస్మార్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబర్ 28 న జరగనుంది.మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పెండ్లి వేడుక కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఐదేండ్ల కిందట కన్న తండ్రి, సవతి తల్లి హింసకు గురైన ప్రత్యూషను సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకొన్న సంగతి తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆమె వసతి, విద్య, ఇతర బాగోగులను మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు చూసుకుంటున్నారు. ప్రత్యూష ఇటీవల నర్సింగ్‌ విద్యను కూడా పూర్తిచేసింది. ఆమెకు నచ్చిన యువకుడితో రెండునెలల కిందటే నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 28న పెండ్లి వైభవంగా జరిపించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లుచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల్‌ పాటిగడ్డ గ్రామంలోని లూర్దు మాత దేవాలయంలో క్రైస్తవ సంప్రదాయంలో వివాహ వేడుక నిర్వహించనున్నారు. ప్రత్యూష పెండ్లికి రావాలని అధికారులు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ‘వధువు కు నిమ్స్‌లో ఉద్యోగం ఇస్తాను’ అని సీఎం హామీ ఇచ్చినట్టు శిశుసంక్షేమశాఖ జేడీ (స్కీమ్స్‌) కేఆర్‌ఎస్‌ లక్ష్మి వెల్లడించారు.