అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశించిన కేంద్రం

ఢిల్లీ : ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌పై చ‌ర్య‌ల‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్‌, వాల్‌మార్ట్ యాజ‌మాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)తో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ను కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ కంపెనీలు ఎఫ్‌డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) ను ఉల్లంఘించాయని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చేసిన ప‌లు ఫిర్యాదులను అనుస‌రించి కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది. వివిధ కంపెనీల‌కు ఇ-కామ‌ర్స్ సంస్థ‌లకు మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంలో బ్రాండ్ రిటైలింగ్ పేరుతో ఏ విధంగా ఎఫ్‌డీఐ పాల‌సీ, ఫెమా చ‌ట్టాల‌ను ఉల్లంఘించాయో తెలియ‌జేస్తూ సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భార‌తీయ‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌వీణ్ ఖండేల్‌వాల్ ఈడీ, ఆర్‌బీఐకి ఇచ్చిన స‌మాచారంలో పేర్కొన్నారు.