ఇద్దరు యువతులతో ఏకకాలంలో ప్రేమ వ్యవహారం నడిపాడో యువకుడు. అయితే ఎవరినీ వదులుకోలేని పరిస్థితి. దీంతో ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే ఏం జరిగింది? ఆసక్తి కలిగించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ సమీపంలో ఉన్న ‘తిక్రాలొహంగా’ అనే గ్రామంలో జరిగిన ఓ వివాహం యావత్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. చందు మౌర్య అనే యువకుడు హసీనా (19), సుందరి (21) అనే యువతులను ప్రేమించాడు. యువతులిద్దరూ ఇంటర్ వరకూ చదువుకున్నారు.చందుకు పెళ్లి చేయాలని కుటుంబ పెద్దలు నిశ్చయించుకున్నారు. దీంతో అతనికి సమస్య వచ్చి పడింది. ఒక వైపు మనసులో ఇద్దరు మహిళలకు చోటు. మరోవైపు ఒకరితోనే మనువు అంటే మనసు అంగీకరించలేదు. తన సమస్యను గ్రామపెద్దల ముందు ఉంచాడు. ఇద్దరు యువతుల తల్లిదండ్రులతో గ్రామపెద్దలు చర్చించారు. ఇద్దర్నీ చేసుకున్నా తమకెలాంటి అభ్యంతరం లేదని పెద్దలు అంగీకరించారు.దీంతో ఇద్దరు యువతులకు మూడు ముళ్లు వేసి, ఏడడుగులు వేశాడు. అది కూడా ఒకే కల్యాణ మండప వేదికపై కావడం గమనార్హం. ఇద్దరమ్మాయిలను ఏకకాలంలో పెళ్లి చేసకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరిని పెళ్లి చేసుకోవడం తమ గిరిజన సంప్రదాయమని గ్రామపెద్దలతో పాటు యువతుల తల్లిదండ్రులు చెబుతుండడం గమనార్హం.
