అంగట్లో బీజెపీ టికెట్లు..

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిందో లేదో కమలనాథుల్లో టికెట్ల కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ పెద్దలు తమ సొంత వారికి టికెట్లు ఇప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారంతో కార్యకర్తలు రగిలిపోతున్నారు. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. పార్టీలో మొదటినుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను కాదని.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన తన బావమరిదికి గోషామహల్‌ టికెట్‌ కట్టబెటుతున్నారని వారు ఆరోపించారు.రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే గోషామహల్‌కు చెందిన కార్యకర్తలు లక్ష్మణ్‌ డౌన్‌..డౌన్‌.. అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. టికెట్ల పంపకంలో తమకు అన్యాయం చేస్తే సహించేది లేదని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి మాత్రమే టికెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జియాగూడ టికెట్‌ను జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాములు తనయుడికి కేటాయిస్తున్నారని తెలియడంతో ఆ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు సైతం నిరసన వ్యక్తం చేసే ప్ర్యత్నం చేశారు గమనించిన నాయకులు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం జరుగలేదని చెప్తూ కార్యకర్తలకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కొప్పుల నరసింహారెడ్డికి మన్సూరాబాద్‌ టికెట్‌ కేటాయించడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మేయర్‌ బండ కార్తీక తన వర్గానికి రెండు, మూడు డివిజన్లు డిమాండ్‌ చేస్తున్నారనే ప్రచారం బీజేపీ నేతలకు మింగుడు పడటంలేదు. బుధవారం అధికారికంగా జాబితా వెల్లడైతే ఈ అసంతృప్తి మరింత ప్రజ్వరిల్లే అవకాశాలులేకపోలేదు.