ఒక రాష్ట్రం-ఒకే కార్డు

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు మీ జేబులో ఇక నుంచి ఇంకో కార్డుకు స్థానం కల్పించండి. త్వరలోనే ‘వన్‌ తెలంగాణ’ కార్డు అందుబాటులోకి రానున్నది. డబ్బుల కోసం జేబులు తడుముకోవాల్సిన అవసరం లేకుండానే.. ఎలాంటి  ప్రయాణమైనా ఈ కార్డుతో ఎంచక్కా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఎక్కిన చోట నుంచి దిగిన చోటుకు  ఉన్న దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించవచ్చు. ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ‘కామన్‌ మొబిలిటీ పేమెంట్‌’ సౌకర్యాన్ని తీసుకువస్తున్నది. ఈ ప్రాజెక్టును యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీ పర్యవేక్షిస్తున్నది.

ప్రయాణం ఏదైనా.. కార్డు ఒక్కటే.. అవును నమ్మలేకపోతున్నారా.. ఇది నిజం.. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అన్నింటికీ ఒక్కటే కార్డును అందుబాటులోకి తీసుకువస్తున్నది. అదే ‘వన్‌ తెలంగాణ కార్డు’(కామన్‌ మొబిలిటీ పేమెంట్‌ కార్డు). చేతిలో ఈ కార్డు ఉంటే చాలు.. నగరమంతా చుట్టేయొచ్చు. హైదరాబాద్‌ మహానగరంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా, ఆటో రిక్షాలో ఎక్కినా, చివరకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ రైలు, ఓలా, ఉబర్‌ ఇలా ఎందులోనైనా..  ప్రయాణం చేసేయొచ్చు. చిల్లర డబ్బుల కోసం జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదు.  ‘వన్‌ తెలంగాణ కార్డు’ ద్వారా ఎక్కిన చోట నుంచి దిగిన చోటుకు వెళ్లిన దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించవచ్చు.

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, ప్రజా ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘ఒక దేశం- ఒక కార్డు’ ఉండాలని నిర్ణయించి గత ఏడాది నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు (ఎన్‌సీఎంసీ)ను ప్రారంభించారు. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలన్నింటీలో డబ్బుల చెల్లింపును సులభతరం చేస్తూ.. ‘వన్‌ తెలంగాణ కార్డు’ను తీసుకువస్తున్నది. ఒక్కసారి ఈ కార్డు వాడుకలోకి వస్తే హైదరాబాద్‌ మహానగరంలో ఎలాంటి ప్రయాణ సాధనంలో ప్రయాణం చేసినా ఇది చెల్లుబాటు అయ్యేలా పూర్తి స్థాయిలో అనుసంధానం కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. దీనికి సంబంధించిన ప్రక్రియను హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ( హెచ్‌ఎండీఏ) పరిధిలోని యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీ (ఉమ్టా) పర్యవేక్షిస్తున్నది.

ప్రభుత్వం ప్రత్యేక చొరవ…

ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణం చేసే సమయంలో ఉండే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని వన్‌ తెలంగాణ కార్డు తీసుకువచ్చే బాధ్యతను ఉమ్టాకు అప్పగించింది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా ఒక కన్సార్టియంను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రవాణా రంగంలో ఉన్న వారందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తే వన్‌ తెలంగాణ కార్డు వినియోగం సులభంగా ఉండి విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయని, దీనిపై ప్రధానంగా కసరత్తు జరుగుతుందని హెచ్‌ఎండీఏ అధికారి తెలిపారు. హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలును ప్రారంభించిన సమయంలో స్మార్ట్‌ కార్డును తీసుకురావాలని భావించినా.. కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం దీనిపైనే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే దీన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.

 

 

 

Source from:”ntnews.com”