హైదరాబాద్: ఆలీబాబ్ సహ వ్యవస్థాపకుడు, చైనా బిలియనీర్ జాక్ మా.. గత రెండు నెలల నుంచి ఆచూకీ లేరు. గత ఏడాది అక్టోబర్‌లో చైనా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆయన వివాదాస్పద ప్రసంగం చేశారు. అయితే ఆ నాటి నుంచి జాక్ మా ఆనవాళ్లు లేనట్లు తెలుస్తోంది. ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ అన్న టీవీ షో ఫైనల్ ఎపిసోడ్‌లో న్యాయనిర్ణేతగా హాజరు కావాల్సిన జాక్ మా.. ఆ షోలో పాల్గొనలేదు. దీంతో ఆయన కనిపించకపోయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నారు. షాంఘైలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న జాక్ మా.. చైనా నియంత్రణాధికారులను, ప్రభుత్వ బ్యాంకుల తీరను ఖండించారు. చైనా వ్యాపార నియంత్రణ వ్యవస్థను సంస్కరించాలని కూడా ఆయన ఆనాటి ప్రసంగంలో అభిప్రాయపడ్డారు. నేటి ఆర్థిక వ్యవస్థ.. పరిశ్రమ యుగానికి చెందినట్లుగా ఉందని, వచ్చే తరానికి కావాల్సిన కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని, దాని కోసం ప్రస్తుత వ్యవస్తను సంస్కరించాలని జాక్ మా అభిప్రాయపడ్డారు.అయితే జాక్ మా చేసిన వ్యాఖ్యలతో చైనా ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ నేరుగా తన ఆదేశాలతో జాక్ మాను అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యాంట్ గ్రూపులో జాక్ మా సుమారు 37 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టేందుకు ప్రయత్నంచిగా.. దాన్ని అధ్యక్షుడు జిన్‌పింగ్ అడ్డుకున్నారు. ఆ తర్వాత అలీబాబా సంస్థపై యాంటీ మోనోపలీ విచారణకు ఆదేశించారు. దీని వల్ల ఆ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. జాక్ మా ఆస్తులు సుమారు 63 బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది.