అఖిలప్రియకు చికిత్స అవసరం…

హైదరాబాద్‌ : కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితిపై ఆమె తరఫు న్యాయవాది సికింద్రాబాద్‌ కోర్టులో మెమో దాఖలు చేశారు. చికిత్స నిమిత్తం ఆమెను దవాఖానకు తరలించాలని పేర్కొన్నారు.  జైలులో అఖిల ప్రియ కిందపడటంతో  ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. హెల్త్‌ బులెటిన్‌ విడుదలకు జైలు అధికారులను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ముగ్గురు వ్యాపారుల కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కాగా అఖిల ప్రియకు బెయిల్‌ మంజూరు చేయవద్దంటూ ఈ మధ్యాహ్నం బోయిన్‌పల్లి పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేస్తే విచారణ నుంచి ఆమె తప్పించుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌ తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.