హైద‌రాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవ‌లు

న్యూఢిల్లీ: మీరు ఎయిర్‌టెల్ వినియోగ‌దారులా.. అయితే హైద‌రాబాద్‌లో 5జీ సేవ‌లందించేందుకు ఎయిర్‌టెల్ సిద్ధ‌మైంది. దీనివ‌ల్ల 5జీ ఫోన్ నుంచి ఫుల్‌లెంత్ సినిమాను సెక‌న్ల‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేయ‌డంతోపాటు స‌రిప‌డా స్పెక్ట్రం జారీ విడుద‌ల చేసిన త‌ర్వాత 5జీ సేవ‌లు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి. త‌ద్వారా దేశంలో తొలిసారి విజ‌య‌వంతంగా 5జీ సేవ‌లు అందుబాటులోకి తెచ్చిన సంస్థ‌గా ప‌్ర‌ముఖ ప్రైవేట్ టెలికం ఆప‌రేట‌ర్ భార‌తీ ఎయిర్‌టెల్ నిలిచింది.

ప్ర‌త్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోక‌మ‌ర్షిల్ నెట్‌వ‌ర్క్ ప‌రిధిలో త‌మ సంస్థ వినియోగ‌దారుల‌కు 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపింది. ఎన్ఎస్ఎ (నాన్‌-స్టాండలోన్‌) నెట్‌వ‌ర్క్ టెక్నాల‌జీ ద్వారా 1800 ఎంహెచ్‌జ‌డ్ బ్యాండ్ ప‌రిధిలో ఎయిర్‌టెల్ 5జీ సేవ‌ల‌ను వినియోగంలోకి వ‌చ్చాయ‌ని వెల్ల‌డించింది. ఇదే స్ప్రెక్టం బ్లాక్‌తో ఏక‌కాలంలో 4జీ, 5జీ సేవ‌లను క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు పేర్కొంది. రేడియో, కోర్‌, ట్రాన్స్‌పోర్ట్ స‌హా అన్ని డొమైన్ల‌లో 5జీ సేవ‌లందించేందుకు సిద్ధ‌మ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టెక్నాల‌జీతో పోలిస్తే 10ఎక్స్ స్పీడ్స్‌, 10ఎక్స్ లెటెన్సీ, 100ఎక్స్ కాంక‌రెన్సీ టెక్నాల‌జీ సేవ‌ల‌ను అందించే సామ‌ర్థ్యం ఎయిర్‌టెల్ 5జీకి ఉంది.

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా తాము పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని ఎయిర్‌టెల్ సీఈవో కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ గోపాల్ విఠ‌ల్ చెప్పారు. హైద‌రాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన 5జీ సేవ‌లు పెనుమార్పుల‌కు దారి తీస్తుంద‌న్నారు. ప్ర‌తి భార‌తీయుడికి సాధికార‌త క‌ల్పించేందుకు క్రుషి చేస్తున్న‌ట్లు తెలిపారు. ఎల్ల‌వేళ‌లా తాము నూత‌న టెక్నాల‌జీల‌ను వినియోగంలోకి తేవ‌డంలో మార్గ‌ద‌ర్శ‌కంగా ఉంటామ‌ని వివ‌రించారు. 5జీ ఇన్నోవేష‌న్‌కు గ్లోబ‌ల్ హ‌బ్‌గా నిలిచే సత్తా భార‌త్‌కు ఉంద‌ని తాము న‌మ్ముతున్నామ‌ని గోపాల్ విఠ‌ల్ తెలిపారు.