ఆన్‌లైన్ ర(డ)మ్మీ

అంబర్ పేట్,తీస్మార్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం కొనసాగుతున్నప్పటికి కొందరు వ్యక్తులు అత్యాశతో ఫేక్‌ జీపీఎస్‌ ఉపయోగించి రమ్మీ ఆడుతూ లక్షలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా అంబర్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.70లక్షలు పొగొట్టుకొని లబోదిబోమంటూ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం ఉండగా, ఎలా ఓపెన్‌ అయ్యిందంటూ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజం తెలిసింది. బాధితుడు ఫేక్‌ జీపీఎస్‌తో రమ్మీ అడినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేమంటూ తేల్చిచెప్పారు. రెండేండ్లుగా రెండు ఐడీలతో బాధితుడు ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నాడు. అప్పులు చేసి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు. రేపు, మాపు లాభాలొస్తాయంటూ అందులో పెట్టుబడులు పెడుతూ ఉన్నదంతా పొగొట్టుకున్నాడు.

2017లోనే నిషేధం విధించిన ప్రభుత్వం..
ఆన్‌లైన్‌లో నిర్వహించే జూదానికి సంబంధించిన గేమ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే నిషేధం విధించింది. దీంతో రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఓపెన్‌ కాదు. కొన్నిసార్లు ఆన్‌లైన్‌ రమ్మీకి సంబంధించిన ప్రకటనలు చూసి కొందరు ఈ గేమ్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఈ గేమ్‌ ఆన్‌లైన్‌లో ఓపెన్‌ కాకపోవడంతో, నకిలీ జీపీఎస్‌ యాప్‌లను వాడుతున్నారు. ఈ యాప్‌లతో హైదరాబాద్‌లో ఉంటూ, లోకేషన్‌ను బెంగుళూరు, ముంబైలో ఉన్నట్లు సెల్‌ఫోన్‌లో చూపించడంతో గేమ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆన్‌లైన్‌ జూదం ఆడి పలువురు మోసపోతున్నారు. ఇదిలా ఉండగా నకిలీ జీపీఎస్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌లో రమ్మీ అడితే ఎలాంటి చర్యలు తీసుకోలేమని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.