రేపు భారత్‌ బంద్‌..మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా బంద్‌ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నేత భూటాసింగ్‌ తెలిపారు. శాంతియుతంగానే బంద్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభావంతంగా ఉంటుందన్నారు. ఈ నెల 28న హోలికా దహనం సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన పత్రాలను దహనం చేసేందుకు రైతులు యోచిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను బంద్ నుంచి మినహాయించినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. బంద్‌కు ప్రజలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని రైతు నాయకుడు దర్శన్ పాల్ కోరారు.

బంద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు

ఇదిలా ఉండగా ఏపీలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలుపుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారన్నారు. బంద్‌ నేపథ్యంలో బస్సులు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రోడ్లెక్కనున్నాయి. బంద్‌ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published.