అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని భూముల విషయంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఏపీ హైకోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 16న సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెక్షన్ 41సీఆర్పీసీ కింద నోటీసులు అందజేసి, ఈ నెల 23న విజయవాడలోని కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. అలాగే టీడీపీ నేత, మాజీ మంత్రి పీ నారాయణ సైతం ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఆయనకు సైతం బుధవారం సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఇదే విషయంలో విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్లోని నారాయణ విద్యాసంస్థలు, ఆఫీసుల, నివాసంలో సోదాలు నిర్వహించారు. మోసం, కుట్రతో అసైన్డ్ భూములు లాక్కొన్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత 24న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా 10 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.