పద్మజ అరుపులు-కేకలతో వణికిపోతున్న ఖైదీలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురుషోత్తం, పద్మజ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మదనపల్లె సబ్-జైలులో ఉన్న పద్మజ.. తన ప్రవర్తనతో తోటి మహిళా ఖైదీల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న రాత్రి జరిగిన ఘటనతో మహిళా ఖైదీలంతా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన విచిత్ర ప్రవర్తనతో తోటి ఖైదీలకు విశ్రాంతి లేకుండా చేస్తోందట పద్మజ. శివ..శివ అంటూ గట్టిగా అరవడంతో పాటు కలియుగం అంతమైపోతోందని, ప్రస్తుతం దేవుడికి-రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోందంటూ తోటి ఖైదీలతో ఆమె పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందట. దీంతో మిగతా మహిళా ఖైదీలు నిద్రలేని రాత్రిళ్లు గడుపుతున్నారు.మరోవైపు పురుషోత్తం నాయుడు మాత్రం తనకు కేటాయించిన జైలు గదిలో సైలెంట్ గా ఉంటున్నారట. ఎక్కువగా ధ్యానంలోనే ఉంటూ, మధ్యమధ్యలో ఏడుస్తున్నారట. ప్రస్తుతానికైతే పురుషోత్తంతో ఎలాంటి సమస్య లేదని, పద్మజతోనే కాస్త ఇబ్బందిగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.గత నెల 24న మూఢనమ్మకంతో కన్న బిడ్డల్నే చంపుకున్నారు ఈ దంపతులు. వాళ్లు కూడా చనిపోవడానికి రెడీ అయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రుయాలో వీళ్లకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. పద్మజ పరిస్థితి నిలకడగా ఉందని భావించి, ఆమెను తిరిగి మహిళా బ్యారక్ కు పంపించారు.అయితే రాత్రి నుంచి పద్మజ మానసిక స్థితి మళ్లీ అదుపుతప్పినట్టు భావిస్తున్నారు. రుయా ఆస్పత్రి సిఫార్సు మేరకు ఆమెను విశాఖకు తరలించాలని భావిస్తున్నారు పోలీసులు. దీనిపై ఇంకా కోర్టు ఆదేశాలు వెలువడాల్సి ఉంది.