విశాఖ జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతి చెందగా 19మంది గాయపడ్డారు. బస్సు ప్రయాణికులందరూ హైదరాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి అరకు వచ్చి.. తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని, బాధితులకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు ఐదో నంబర్ మలుపువద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు బోల్తాపడిన తరువాత 80 అడుగుల లోతు వరకు దూసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఎస్‌కోట, అనంతగిరి, కేజీహెచ్ దవాఖానలకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చీకటిగా ఉండటంతో సహాయచర్యలకు అంతరాయం ఏర్పడుతున్నది. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని భావిస్తున్నారు. ప్రమాద వివరాలకోసం అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. వివరాలకు 08912590102, 08912590100 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
డ్రైవర్ తప్పిదం వల్లనే!
ప్రమాదానికి గురైన బస్సును హైదరాబాద్ షేక్‌పేట్‌లోని దినేశ్ ట్రావెల్స్‌కి చెందినదిగా గుర్తించారు. బస్సు 26 మంది పర్యాటకులతో ఈ నెల 10న ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ నుంచి విహారయాత్రకు బయలుదేరింది. ఈ నెల 14న విహారయాత్ర ముగించుకొని హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. బస్సులో విహారయాత్రకు బయలుదేరిన వారంతా బంధువులుగా భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్టు బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రయాణం మొదలైన రోజు నుంచి బస్సు డ్రైవర్ తమతో దురుసుగానే వ్యవహరించాడని, అనేకసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పలువురు బాధితులు రోదిస్తూ చెప్పారు.
మిన్నంటిన రోదనలు
ప్రమాదం జరిగిన లోయ ప్రాంతంలో బాధితులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బస్సు కుదుపులకు గురవుతున్నపుడే ఏం జరుగుతున్నదని డ్రైవర్‌ను అడుగుతుండగానే ఒక్కసారిగా లోయలోకి దూసుకుపోయిందని బాధితులు చెప్పారు. ఎవరు ప్రాణాలతో ఉన్నారో, ఎవరో చనిపోయారో తెలియక బాధితులు హృదయవిదారకంగా రోదించారు. బస్సు బోల్తాకొట్టి లోయలోకి పడిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని తొలుత భావించారు. స్థానికంగా ఉన్నవారు వెంటనే స్పందించి లోయలోకి వెళ్లి బస్సులోనుంచి పలువురికి బయటకు తీశారు. ‘మా వద్ద ఫోన్లు కూడా లేవు. మా డబ్బులు, వస్తువులన్నీ లోయలోనే పడిపోయాయి. ఊరుగాని ఊరులో దిక్కులేని స్థితికి చేరుకున్నాం. మా వాళ్లు ఎవరు ఎక్కడ ఉన్నారో’ అంటూ దవాఖానల్లో చేరిన వారు కన్నీరు మున్నీరవుతున్నారు. గాయపడినవారిలో కొంద రు చిన్నారులు తమ తల్లిదండ్రుల కోసం రోదించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
ప్రధాని మోదీ, గవర్నర్ సానుభూతి
అరకు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు ప్రమాద ఘటనదిగ్భ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలనిఅధికారులను ఆదేశించారు. అరకు ప్రమాదం తీవ్ర విచారకరమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.
మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
అరకు రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాద బాధితులకు అండగా ఉండి అని సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబాలకు హోంమంత్రి మహమూద్ అలీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అరకు ప్రమాదం పట్ల ఆర్థికమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి
అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగడం పట్ల విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిందని తెలిసిన మరుక్షణమే ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులను సహాయ చర్యలు చేపట్టాలని, ఏపీలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతుల వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ లేళ్ల కాళిదాస్, ఎస్పీ శ్రీకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులను శృంగవరపు కోట దవాఖాన, విశాఖపట్నంలోని కింగ్‌జార్జ్ హాస్పిటల్లోలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు వారు పేర్కొనటంతో ఇక్కడి వైద్యాధికారులతో అక్కడి డాక్టర్లకు ఫోన్‌చేసి వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరాతీశారు. అరకు వెళ్లిన వారి జాబితా ఆధారంగా హైదరాబాద్‌లోని వారి ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని సీఎస్ ఆదేశించారు. ప్రమాదానికి గురైన బస్సు ఏ ట్రావెల్స్‌ది, దానికి ఉన్న అనుమతి, కండిషన్, డ్రైవర్ లైసెన్స్ వివరాలను తెలుసుకోవాలని రవాణా అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ట్రావెల్స్ యజమానికి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి స్థానిక పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.